తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.53 ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు.

శుక్రవారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ జీహెచ్‌ఎంసీగా మారి ఏడాది పూర్తయినప్పటికీ కార్మికులకు ఇప్పటికీ పాత మున్సిపల్ వేతనాలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ జీవోలకు అనుగుణంగా కార్మికులందరికీ వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆగస్టు 10న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ రంగాల కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని, కార్మికులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జీహెచ్‌ఎంసీ జీవోల ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ నార్సింగి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మైపాల్ యాదవ్, కార్యదర్శి ఎస్. జనార్దన్ రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.