తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సోలిపేట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన చూపిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, అచంచల నిబద్ధత, త్యాగస్ఫూర్తి భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రజాసేవ, సమాజ అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేయడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు అందించే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మల్లయ్యతో పాటు జోనల్ కార్యాలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.