తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ధర్మసాగర్: పిల్లల్లో విజయాన్ని సాధించాలంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, సరైన అవగాహన కల్పించడం ఎంతో అవసరమని సైకాలజిస్ట్ డా. అశోక్ పరికిపండ్ల అన్నారు.
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డా. అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమలోని ప్రతిభను గుర్తించుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి నిరాశ చెందకుండా, వాటిని అధిగమించే మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
పిల్లల మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా, వారి ఆసక్తులు మరియు సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు.
విద్యార్థి దశలోనే సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అది దోహదపడుతుందని డా. అశోక్ పరికిపండ్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
