తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఆగస్టు 8: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గణేష్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్టవుతుందని అన్నారు.
శనివారం హన్మకొండలోని అడిషనల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను అడిషనల్ కలెక్టర్ గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థలు గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇటీవల పోలీసు శాఖలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పోలీసు సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచి కార్యక్రమమని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పోలీసు సిబ్బందితో పాటు వివిధ వర్గాలకు విస్తృతంగా ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతితో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. వారికి మానసిక ధైర్యాన్ని అందించి, “నువ్వు ఒంటరివి కాదు.. మేమున్నాం” అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కష్టాల్లో ఉన్న వ్యక్తికి తన ముందున్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు ఆత్మహత్య ఆలోచన రావచ్చని, అలాంటి ప్రమాదకర సమయంలో అతనికి అండగా నిలిచి ధైర్యం చెప్పగలిగితే ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు రాంపెల్లి లింగమూర్తి మాట్లాడుతూ.. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వైఫల్యాలు, ఒత్తిళ్లు తాత్కాలికమైనవేనని, వాటిని అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆడేపు రాజేంద్రప్రసాద్, ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
