తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ – ఆప్కో కాలనీలో టీఎన్జీవోఎస్ కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లు గుంతలమయంగా మారడం, రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటం, విచ్చలవిడిగా చెత్త పేరుకుపోవడం, ప్రధాన రహదారిపై వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లయ్యకు స్థానికుల తరఫున వినతిపత్రం అందజేశారు. కాలనీల్లోని అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయని స్థానికులు వినతిపత్రంలో పేర్కొన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాలనీవాసులు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రాత్రి వేళల్లో అవి కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవు తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కాలనీల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో, రోడ్లకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగల బెడద పెరుగుతోందని తెలిపారు. సంబంధిత పారిశుధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదర్శ – ఆప్కో కాలనీ నుంచి టీఎన్జీవోఎస్ 60 అడుగుల ప్రధాన రహదారి వరకు వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉందని వినతిపత్రంలో వివరించారు. రహదారిపై కొన్ని విద్యుత్ స్తంభాలకు దీపాలు లేకపోగా, మరికొన్ని స్తంభాలపై ఉన్న దీపాలు సైతం వెలగడం లేదని పేర్కొన్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారి మొత్తం చీకటిమయంగా మారుతోందని తెలిపారు. పరిశ్రమల్లో విధులు నిర్వహించి రాత్రి వేళల్లో ఇళ్లకు తిరిగి వచ్చే మహిళా కార్మికులు, ద్విచక్ర వాహనదారులు చీకటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై సరైన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేసి, పనిచేయని దీపాలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలు ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, మురుగునీటి నిల్వలను తొలగించడం, చెత్తను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం, వీధి దీపాలను పునరుద్ధరించడం వంటి పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ, రాకపోకలకు సంబంధించిన ఈ సమస్యలపై అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లయ్య ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం బి ఆర్ ఎస్ నాయకులు గాజుల నరేష్ యాదవ్ మాదాస్ వెంకటేష్ రచ్చ వారి శ్రీను గుంటి శివకుమార్ నాగరాజు పవన్ కుమార్ రెడ్డి శశిదర్ మంజునాథ్ వెంకట్ రెడ్డి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు
