అంజలి కిడ్నీ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
ప్రజలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
పట్టణంలోని బాలికల పాఠశాల ఆవరణలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ గీతాంజలి నరేష్ (యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, కిడ్నీ సర్జన్), డాక్టర్ నరేష్ సముద్రాల (ఫ్యామిలీ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్) ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో పట్టణ ప్రజలందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుత కలుషిత వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుల్లీ ప్రతాప్, చిన్నాల శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
