తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన, అరుదైన ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఉండాల్సిన ఒక పెద్ద మొసలి ఒడ్డుకు వచ్చి నేరుగా ఘాట్ సమీపంలోని ఒక భవనంలోకి ప్రవేశించింది. వరుస సెలవులు కావడంతో ఆంజనేయస్వామి దర్శనానికి, కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు, సందర్శకులు మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వరుణ దేవుడి వాహనంగా భావించి. అయితే అందరూ భయంతో దూరంగా జరుగుతుండగా, పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం ఎంతో ధైర్యంతో ఆ మొసలి ముందే కూర్చుని పూజలు ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొసలిని వరుణ దేవుడి దివ్య వాహనంగా భావించిన ఆయన, వేద మంత్రాలు జపిస్తూ పసుపు, కుంకుమ, పుష్పాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు వర్ధిల్లి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు పురోహితుడు అనిల్ శర్మ తెలిపారు. వన్యప్రాణి పట్ల భయపడకుండా భక్తిభావంతో పూజలు చేసిన ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశమైంది.
