తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం ఏఆర్ దేవరాజ్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి, సీపీఐ తెలంగాణ నియంత్రణ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగరావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుస్తకాల నర్సింగరావు, కన్యగారి నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా ఆశించిన స్థాయిలో పేదలకు స్వాతంత్ర్య ఫలాలు అందలేదని అన్నారు. దేశ శ్రేయస్సు కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు, పప్పు, ఉప్పు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు.కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలు ఐక్యంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల ఐక్యతతోనే న్యాయం సాధ్యమవుతుందని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగించాలని అన్నారు.
దుర్గానగర్‌లోనూ జాతీయ జెండా ఆవిష్కరణ దుర్గానగర్‌లో సీపీఐ మండల సహాయ కార్యదర్శి జె. విజయానంద్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.ఏ. రియాజ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జే. ఆనంద్ గౌడ్, భారత జాతీయ మహిళా సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు కన్యగారి లక్ష్మి, మండల అధ్యక్షురాలు మునేశ్వరి, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి జె. విజయానంద్ గౌడ్, మండల కార్యాలయ కార్యదర్శి జి. సత్యం, మండల శాఖ కార్యదర్శి జే. సదానంద గౌడ్, పాండు, సాబీర్ హుస్సేన్, శ్రీరాములు, స్వరూప, వాణి, మౌనిక, జ్యోతి, బుజ్జి, ఊర్మిళ, శ్రీనివాస్, జంగయ్య, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ కాజా, ఎం.డి. సలీం, మధు తదితరులు పాల్గొన్నారు.