తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాజేంద్రనగర్ డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పర్‌పల్లి చౌరస్తాలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డివిజన్ అధ్యక్షుడు పసుపుల సందీప్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ​ ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. “శ్రీరాముడు ధనవంతుల దేవుడని, శివుడు పేదల దేవుడని” సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవుళ్ల మధ్య కూడా వ్యత్యాసాలు చూపుతూ మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. హిందువుల విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.