తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి సింగిల్‌ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో కీలకమైనవని అన్నారు. వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.