తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం మంత్రిని కలిసి చేనేత రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రికి వివరించి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.
చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల మెరుగుదల, చేనేత రంగానికి ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై ప్రతినిధులు మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అందె జ్యోతిగణేష్ తదితరులు పాల్గొన్నారు.
