తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బుధవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్బీ 3వ ఫేజ్ మరియు 4వ ఫేజ్లో ఏర్పాటుచేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం, మూసాపేట్ డివిజన్లోని ఆంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. విఘ్నేశ్వర స్వామి ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
