తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఉపాధ్యాయులు పిఆర్సి అందుకోకుండానే పదవీ విరమణ పొందే పరిస్థితి దాపురించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ఆరోపించారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సత్యనారాయణ రాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ​

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ఫెడరేషన్ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కపట ప్రేమ చూపుతోందని, ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదని విమర్శించారు. చర్చల్లో కేవలం ఒక డిఎ ఇవ్వడానికే ప్రభుత్వం మొగ్గు చూపినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాల తీవ్ర వ్యతిరేకతతోనే రెండు డిఎలు ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ప్రకటించిన రెండు డిఎలకు తాము సంబరపడిపోయేది లేదని తెగేసి చెప్పారు. ఫెడరేషన్ డిమాండ్లు: ​పిఆర్సి నివేదిక తెప్పించి తక్షణమే పిఆర్సిని అమలు చేయాలి. ​సిపిఎస్ రద్దుకు కమిటీ వేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ​ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించే వరకు నెలకు ₹2,000 కోట్లు విడుదల చేయాలి. ​విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి పాఠశాలల్లో ఉన్న సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలన్నింటినీ క్రమబద్ధంగా డిసెంబర్ 2026 నాటికి పరిష్కరించాలని, లేనిపక్షంలో టిఎస్ యుటిఎఫ్ తరఫున మళ్లీ ఉధృతమైన పోరాటం చేసి సాధించే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల అధ్యక్షుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జూపల్లి శ్రీనివాసులు, పద్మశాలిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాస రవి, యాదగిరి, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్, సీత్య నాయక్, సాధత్ అలీ, ఖాలిద్, ప్రభాకర్, గోపాలకృష్ణ, కిరణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.