తెలంగాణ ఎక్స్ ప్రెస్, కామారెడ్డి జిల్లా:జిల్లాలోని బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిక్కనూర్ ఎస్సై అనిల్ హాజరయ్యారు. ముందుగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు ఎస్సై అనిల్‌ను శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి గొడవలు, అల్లర్లు చోటుచేసుకోకుండా భక్తులు సంయమనం పాటించాలని కోరారు. ముఖ్యంగా నిమజ్జనం సమయంలో డీజే సౌండ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సాంస్కృతిక పద్ధతిలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్సై సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
అనంతరం గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి, ఉప సర్పంచ్, విడిసి సభ్యులు, విశ్వసేన యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సై అనిల్‌తో పాటు కార్యక్రమానికి హాజరైన భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విశ్వసేన యూత్ చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. గ్రామంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేలా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
