తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 27 (ఆదివారం) తేదీన రాష్ట్ర స్థాయి అధికారిక ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించ నున్నారు.హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక వేదిక రవీంద్ర భారతి ఈ ఘనమైన వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటల నుండి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అధికారిక ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు బడుగు, బలహీన వర్గాల నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో మరియు మలిదశ తెలంగాణ సాధనలో బాపూజీ అందించిన నిరుపమాన సేవలను, ఆయన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించు కోనున్నారు. తెలంగాణ సమాజ గతిని మార్చిన మహనీయుడికి ఇచ్చే గౌరవంగా ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రాష్ట్ర స్థాయి వేడుకల్లో ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి సంఘాల సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.