తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, దొరల గడీలను బద్దలుకొట్టిన వీరవనిత, బహుజన బిడ్డ చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని కాటేదాన్ మరియు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ నేతృత్వంలో ముఖ్య నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించిన ఐలమ్మ, నాటి నిజాం పాలనలో భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. “మన భూమి, మన భుక్తి కోసం దొరలకు కప్పం ఎందుకు కట్టాలి?” అని ప్రశ్నిస్తూ, ప్రాణాలకు తెగించి తన పొలంలో పండిన ధాన్యాన్ని దొరల పాలు కాకుండా కాపాడుకున్న ధీరవనిత ఐలమ్మ అని గుర్తుచేశారు.

ఆమె రగిలించిన పోరాట స్ఫూర్తి చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటానికి బలమైన పునాది వేసిందన్నారు. పీడిత ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆమె ఒక దిక్సూచిగా నిలిచారని.. మహిళలు అబలలు కారు, తిరగబడితే భద్రకాళీగా మారగలరని నిరూపించిన మహోన్నత శక్తి ఐలమ్మ అని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించడంలో ఆమె చూపిన తెగువ, ఆత్మస్థైర్యం నేటి తరానికి ఎంతో ఆదర్శమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్. వెంకటయ్య, అక్యాం రాఘవేందర్ యాదవ్, మైసిరెడ్డి బాలరాజు యాదవ్, ఎస్. అశోక్ కుమార్, రామస్వామి, కొంపల్లి జగదీష్, జంపుల భగవాన్ దాస్, సునీల్, పద్మ, పుష్ప రాజు, చికెన్ మోహన్, శేఖర్, సూరి, నాని, అఖిల్, తుకారం, గడ్డం మహేష్‌లతో పాటు పలు కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
