తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో జియో ట్యాగ్ నంబర్లు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న అర్హత కలిగిన చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు.

ఈ మేరకు అక్టోబర్ 5న హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌లో మేడ్చల్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి చౌడేశ్వరి, డీఓ శ్రీ కిషన్ నాయక్లను రాపోలు వీర మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో సుమారు 70 మంది వరకు చేనేత కార్మికులకు జియో ట్యాగ్ నంబర్లు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఉన్నప్పటికీ జియో ట్యాగ్ నంబర్ లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్న కార్మికుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ నెలలో అర్హత కలిగిన చేనేత కార్మికులకు జియో ట్యాగ్ నంబర్లు అందించేలా చర్యలు తీసుకుంటామని సహాయ సంచాలకులు చౌడేశ్వరి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చేనేత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక కోరింది.

Avatar photo

By Murthy