• అక్టోబర్ 11న పద్మశాలి పోప భవన్‌లో మహాసభ.. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిద్దిపేటలోని పద్మశాలి పోప భవన్‌లో జిల్లా పద్మశాలి మహాసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బూర మల్లేశం, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బూర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ డి.ఎన్. స్వామి తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

నిరుపేద పద్మశాలి విద్యార్థులకు ఉపకార వేతనాలు

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన నిరుపేద పద్మశాలి విద్యార్థులకు ముఖ్య అతిథి తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఉపకార వేతనాల కోసం పంతం చక్రపాణి, పంతం రవి రూ.1,00,000, జిందం విఠల్ రూ.10,000 ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థిక నివేదికలు.. కీలక తీర్మానాలు

మహాసభలో జిల్లా పద్మశాలి సంఘానికి సంబంధించిన ఆర్థిక నివేదికలను సమర్పించడంతో పాటు, పద్మశాలీల అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి తదితర అంశాలపై పలు కీలక తీర్మానాలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే జిల్లా పద్మశాలి సంఘం సభ్యత్వం తీసుకోని వారు వెంటనే సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు.

భారీగా తరలిరావాలని పిలుపు

సిద్దిపేట జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలు, మండలాల నుంచి పద్మశాలీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సభ్యత్వం కలిగిన సభ్యులు, సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజ సభ్యులు, గల్లీల వారీగా ఏర్పాటైన పద్మశాలి సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పద్మశాలి సమాజ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.

Avatar photo

By Murthy