తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, లారీ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని టీడీపీ సీనియర్ నాయకులు ఉష్కమూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ డ్రైవర్స్ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటలను, వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తూ డ్రైవర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సేవలు అందిస్తున్నారని తెలిపారు. “చక్రాలు కదిలితేనే కడుపు నిండుతుంది” అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రతి లైసెన్స్‌డ్ డ్రైవర్‌కు రూ.50 లక్షల ప్రభుత్వ బీమా కల్పించాలని, డ్రైవర్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న లైసెన్స్‌డ్ డ్రైవర్ సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.“మాటలు కాదు.. హక్కులు కావాలి.. హామీలు కాదు.. సంక్షేమం కావాలి” అంటూ కార్మికుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో టీ. వెంకటేష్ గౌడ్, వి. శ్రీనివాస్, ఎం.డి. ఇక్బాల్, అబుల్ కరీం, ఎం.డి. మోహిన్, పి. లక్ష్మణ్, ఎం. మహేష్, టి. భరత్ గౌడ్, పి. సాయి, జె. సురేష్ తదితరులు పాల్గొన్నారు.