తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: మహారెడ్డి మండలం, చుక్కాపూర్ గ్రామం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చుక్కాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ పూర్వపు ఆనవాయితీ ప్రకారం గురువారం గ్రామ ప్రధాన కూడలిలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందారం తదితర రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం వాటిని గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసి, బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో” అంటూ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. వివిధ జానపద, సాంస్కృతిక పాటలతో ఆటలు ఆడుతూ సందడి చేశారు.

మహిళల బతుకమ్మ ఆటలు, పాటలతో చుక్కాపూర్ గ్రామ ప్రధాన కూడలి పండుగ శోభను సంతరించుకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆసక్తిగా తిలకించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో వేడుకలకు మరింత కళ వచ్చింది.

గ్రామంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లోనూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ మహిళలు, ప్రజలు సిద్ధమవుతున్నారు.

Avatar photo

By Murthy