తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను నిరసిస్తూ, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, కావూరి ప్రసాద్, రాంచందర్ గౌడ్, రవి కుమార్, ఎన్ఎస్యూఐ స్టేట్ సెక్రటరీ చంద్రమౌళి, ఎన్ఎస్యూఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ సాయి మనోజ్ రెడ్డి, సాయి లోహినాథ్, శశి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు సాగిన నిరసన ర్యాలీలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, ప్రతి పౌరుడి ఓటు హక్కు పవిత్రతను కాపాడాలని కాంగ్రెస్ నాయకులు నినదించారు. శాంతియుత నిరసనలో అరెస్టులు లోక్ భవన్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరని, ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కల్పించాలి ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండేలా పారదర్శకమైన, నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్టులపై ఖండన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ , శ్రీమతి ప్రియాంక గాంధీ , ఇండియా కూటమి ఎంపీల అరెస్టులను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొంటూ, ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కే ప్రజల అసలైన బలం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలం. ఆ ఓటు హక్కును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కు భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
