తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఆదేశాల మేరకు తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశంలోని 140 కోట్ల ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగే అవకాశం ఉందని ఆరోపించారు. రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తీరును నిరసిస్తూ, ఆయనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు.
నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి సంజీవులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు షౌకత్ అలీ, రాజీవ్ కుమార్, పీఎస్‌ఎస్ చైర్మన్ సుధాకర్ రావు, కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్రరావు, సిద్ధిరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, దశరథ్, ముద్దు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
