తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో వెలసిన శ్రీ పోచమ్మ దేవాలయంలో గత మూడేళ్లుగా ప్రతి అమావాస్య రోజున నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వ.హిస్తున్నారు. భక్తుల సహకారంతో వరుసగా 36 నెలల పాటు కొనసాగుతున్న ఈ అన్నదాన సేవ భక్తుల ఆదరణ పొందుతోంది.
శ్రీ పోచమ్మ తల్లిని తమ ఇలవేల్పుగా కొలిచే భక్తులు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ, భక్తుల సహకారం, అమ్మవారి ఆశీస్సులతోనే 36 నెలలుగా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. దైవభక్తితో పాటు సేవాభావాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమం భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్, కిష్టప్ప, బి. వెంకటేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు ఉప్పల్ శ్రీను, దేవాలయ కమిటీ అధ్యక్షుడు సెంట్రింగ్ శంకర్, మల్లేష్, కృష్ణ, బొంబాయి రవి, బుచ్చయ్య, కార్తీక్, ఆనంద్, భాగ్యమ్మ, కుమార్, జగన్, శేఖర్, లక్ష్మణ్, మధుచారి తదితరులు పాల్గొన్నారు.
