• కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరాహార దీక్షకు బీసీ సంఘం నాయకుల సంఘీభావం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్, ఎన్హెచ్ఎం విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 17,500 మంది ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షకు బీసీ సంఘం జిల్లా నాయకులు భీమనాధుని సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులు, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ వైద్యులు, ఏఎన్ఎంలు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాల్లో కొనసాగించడం వల్ల వారి కుటుంబాలు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, అర్హులైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి న్యాయం చేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని భీమనాధుని సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
