తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్యలు, పేరుకుపోయిన చెత్తకుప్పలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తకుప్పలతో దుర్వాసన.. దోమలతో ప్రజల అవస్థలు! : కాలనీల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా మధుబన్ కాలనీ రోడ్డు సమీపంలోని చెత్త సేకరణ కేంద్రం ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని, దానిని వెంటనే మరో అనువైన ప్రదేశానికి మార్చాలని కోరారు.ప్రజల సమస్యలు కనిపించడం లేదా? : ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. చెత్తకుప్పలను వెంటనే తొలగించడంతో పాటు అవసరమైన చోట చెత్త సేకరణ కేంద్రాలను మార్చాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల తీవ్రతను గుర్తించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మైలార్ దేవ్‌పల్లి డివిజన్‌ను చెత్త రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని యు. విజయ్ కుమార్ కోరారు.