• చేనేత వస్త్రాలను ప్రోత్సహించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
• నేతన్నల శ్రమకు ప్రోత్సాహంగా స్వయంగా చేనేత చీరలను కొనుగోలు చేసిన ఎంపీ
• చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
• నేతన్నల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలి

న్యూస్ డెస్క్ : సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కలిసి చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్‌ను పరిశీలించిన ఎంపీ డా. కడియం కావ్య, అక్కడ ప్రదర్శనలో ఉంచిన చేనేత చీరలు, వస్త్రాల ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు నేతన్నల శ్రమకు ప్రోత్సాహంగా స్వయంగా పలు చేనేత చీరలను కొనుగోలు చేసి చేనేత రంగానికి తన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. నేతన్నలు ఎంతో కష్టపడి నేసే ప్రతి వస్త్రంలో వారి కళాత్మకత, శ్రమ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే నేతన్నల కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.