• బీసీ ఆత్మగౌరవ భవనాలు రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి
• కుల సంఘాల సమావేశాలకే పరిమితం కాకూడదు.. రాజ్యాధికార సాధనకు వేదికలు కావాలి
• బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా పాలకులుగా ఎదగాలి: గుజ్జ సత్యం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఆత్మగౌరవ భవనాలు కేవలం కుల సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలకే పరిమితం కాకుండా బీసీల రాజకీయ చైతన్యానికి, హక్కుల సాధనకు, రాజ్యాధికార లక్ష్య సాధనకు కార్యాచరణ కేంద్రాలుగా మారాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిపై ఈ భవనాల్లో నిరంతరం చర్చలు జరగాలని సూచించారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం మంచిదేనని, అయితే వాటి అసలు లక్ష్యం బీసీ సమాజాన్ని సంఘటితం చేసి హక్కుల సాధన దిశగా నడిపించడమే కావాలని పేర్కొన్నారు.

బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కాలని అన్నారు. పార్లమెంట్, శాసనసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు, కులగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్, బీసీ సబ్‌ప్లాన్ చట్టం వంటి డిమాండ్ల సాధనకు నిరంతర ఉద్యమాలు అవసరమన్నారు.

ప్రతి ఆత్మగౌరవ భవనంలో యువతకు రాజకీయ అవగాహన, నాయకత్వ శిక్షణ, రాజ్యాంగ హక్కులపై సదస్సులు నిర్వహించాలని సూచించారు. వివిధ బీసీ కుల సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఉమ్మడి ఉద్యమాలకు వేదికలుగా వీటిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీలు దశాబ్దాలుగా రాజకీయ పార్టీల విజయాలకు అండగా నిలుస్తున్నప్పటికీ, పాలనలో నిర్ణయాత్మక భాగస్వామ్యం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదన్నారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు కోరుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి రాజకీయ వాటా విషయంలో నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.

బీసీలకు సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ అధికారం, విద్యా అవకాశాలు, ఆర్థిక స్వావలంబన అవసరమన్నారు. కులాల మధ్య విభేదాలు, రాజకీయ పార్టీల వారీగా ఏర్పడుతున్న చీలికలను అధిగమించి బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ భవనాల్లో గ్రంథాలయాలు, పోటీ పరీక్షలకు మార్గదర్శక కేంద్రాలు, విద్యార్థి యువజన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

భవనాలు నిర్మించడంతో ప్రభుత్వ బాధ్యత ముగియదని, వాటి నిర్వహణకు నిధులు, నిరంతర కార్యక్రమాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. బీసీలు ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా చట్టసభల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని అన్నారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ చెరుకుల రాజేందర్, బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమ్‌రాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు మేకల పరుశురాం, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కుమార్, విజయ్‌కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామదేవ్ యాదవ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి మనోజ్ గౌడ్, కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల విజయ్ కుమార్, బీసీ నాయకులు వెంకటరామయ్య, నరేంద్ర, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy