తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: వేమన కాలనీ బస్తీ దవాఖానలో 7వ తేదీ టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. మొత్తం 51మందికి ఎక్స్-రే తీశారు. అనుమానితుల నుంచి సాంపిల్స్ సేకరించి సీబీఎన్ఏఏటీ పరీక్షల నిమిత్తం కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమా మహేశ్వర్ టీబీ వ్యాధి గురించి వివరిస్తూ, రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, సాయంత్రం జ్వరం రావడం, శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటే టీబీని అనుమానించి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు 6నుండి 9నెలల వరకు వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని, మందులు మధ్యలో ఆపివేస్తే దీర్ఘకాలిక టీబీ వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే, టీబీ మందులు తీసుకుంటున్న సమయంలో పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రతి రోగికి నెలకు వెయ్యి1,000.రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్‌వైజర్ భీములు, ఆశా కార్యకర్తలు ఆదిలక్ష్మి , సబిత, వెంకటేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.