తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మ్యాకల పర్శరాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు సహకరించిన జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యగా అరుణ్లకు మ్యాకల పర్శరాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిటీలను ఏర్పాటు చేసి, బీసీలను సంఘటితం చేసి వారి హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
అలాగే త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించి బీసీ వర్గాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బీసీలను మరింత చైతన్యవంతులను చేస్తామని ఆర్. కృష్ణయ్య తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనపై నమ్మకం ఉంచిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మ్యాకల పర్శరాములు, బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపెల్లి మనోజ్ గౌడ్, కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈర్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
