తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాధిత మహిళకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తెలంగాణ రక్షణ సేన నాయకులు, మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బాధితులకు అండగా నిలిచే హక్కును కాలరాయడం సరికాదని ఆయన మండిపడ్డారు.
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధిత మహిళా ప్రొఫెసర్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పడాల మనోజ, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నీరుడు సర్వేష్ ముదిరాజ్‌తో పాటు పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కురుమ మాట్లాడుతూ.. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పుడు ఆమెకు నైతిక మద్దతు తెలపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన నాయకులను అరెస్టు చేయడం ఆందోళనకరమని, ఇది ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

అరెస్టు చేసిన నాయకులు, మహిళా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, బాధిత మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు, విచారణలో ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు న్యాయం కోరే గొంతులను అణచివేయడం సాధ్యం కాదని, అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని పూజారి ప్రవీణ్ కురుమ వెల్లడించారు.

You missed