మగ్గాల కొనుగోలుకు నలుగురు నేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందజేత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, మోత్కూర్: పేద చేనేత కార్మికుల సంక్షేమం, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాపోలు శేషాద్రి సుగుణమ్మ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలుగురు నిరుపేద చేనేత కార్మికులకు మగ్గాల కొనుగోలు నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నవంబర్ 12న నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నారై రాపోలు సుదర్శన్–వాసవి దంపతుల తరఫున రాపోలు సుదర్శన్ స్వయంగా ఈ ఆర్థిక సహాయాన్ని వనం శాంతి కుమార్‌కు అందజేశారు. ఒక్కో నేత కార్మికుడికి మగ్గం కొనుగోలు కోసం రూ.25 వేల చొప్పున మొత్తం నలుగురికి రూ.లక్ష అందించనున్నట్లు తెలిపారు.

నిరుపేద చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించిన రాపోలు సుదర్శన్‌కు తెలంగాణ చేనేత కార్మిక సంఘం తరఫున వనం శాంతి కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మారెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, కంబం కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు గంగుల రాములు, చేనేత సంఘం అధ్యక్షుడు వంగరి రాములు, రాపోలు పరంధాములు, పోచం శ్రీను, మంచే గోవర్ధన్, అమరేందర్, పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy