తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పందెన్ వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిశీలనలో వర్షపు నీటి కాలువల నిర్మాణం పేరుతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు చేపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హ్యూడా కాలనీ నుంచి ఎంప్లాయీస్ కాలనీ వరకు, ఆర్కా టీమ్ 4 బిల్డర్ ప్రాంతం నుంచి లక్ష్మీనగర్ కాలనీ మీదుగా అంజలి గార్డెన్స్, ఎల్ఐసీ కాలనీ రోడ్డు వరకు, అలాగే అలకాపూర్ టౌన్షిప్ రోడ్ నంబర్ 30, గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువల నిర్మాణం పేరుతో మురుగునీటి పారుదల పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు సైతం వాస్తవాలను ప్రజలకు వివరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు స్థానికుల్లో నెలకొన్నాయి.
అదేవిధంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థల పాత్ర, పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరిపి, ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
విచారణ పూర్తయ్యే వరకు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పనులను తక్షణమే నిలిపివేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై బాధ్యతను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పందెన్ వాగు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రత, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని సమితి విజ్ఞప్తి చేసింది.
