తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కొత్వాల్‌గూడ 119వ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 626/1, 605లో ఉన్న ప్రభుత్వ, హెచ్ఎండీఏ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ 119వ డివిజన్ అధ్యక్షుడు కొనమొల్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు శంషాబాద్ తహసీల్దార్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కొనమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మిగిలిన భూమిని కబ్జాదారుల బారి నుంచి కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సమన్వయకర్త, ఆర్గనైజింగ్ కార్యదర్శి బుచ్చిరెడ్డి, జయసింహ, ప్రధాన కార్యదర్శులు పరంధాములు, రాజేందర్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, హనుమంతు ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాచమల్ల రమేష్, దర్శన్ గౌడ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
