-గంగపుత్రుల ఐక్యతా గర్జనతో దద్దరిల్లిన రవీంద్రభారతి!
-ఆచార్య సందిరి బాలయ్య 115వ జయంతి సభకు వేలాదిగా తరలివచ్చిన గంగపుత్రులు
-గంగపుత్రుల ఆత్మగౌరవం, హక్కుల సాధనకు ఐక్య ఉద్యమం అవసరం: వక్తలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: జై గంగపుత్ర.. జై జై గంగపుత్ర నినాదాలతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మారుమోగింది. గంగపుత్ర చైతన్య సమితి (జీపీసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర 115వ జయంతి ఉత్సవానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా గంగపుత్రులు తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసింది. గంగపుత్రుల ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక హక్కుల సాధనకు వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. చిన్న సామాజిక వర్గంగా భావించి గంగపుత్రుల శక్తిని తక్కువ అంచనా వేయలేరని, ఐక్యతతో సంఘటితమైతే బలమైన సామాజిక శక్తిగా ఎదగగలమని సభ ద్వారా చాటిచెప్పారు.

జనాభా ప్రాతిపదికన బీసీలకు వాటా: ఆర్. కృష్ణయ్య
ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, 2027 జనగణనలో కులాలవారీగా కచ్చితమైన జనాభా వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు.
గంగపుత్రులు తరతరాలుగా మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి వృత్తికి ప్రభుత్వాలు భరోసా కల్పించాలన్నారు. చెరువులు, జలాశయాలపై సంప్రదాయ మత్స్యకారుల హక్కులను పరిరక్షించాలని, చేపల పెంపకం, మార్కెటింగ్‌లో మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని సూచించారు. బీసీల హక్కుల సాధనకు కుల సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

గంగపుత్రుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అవసరం: గుజ్జ సత్యం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ) మాట్లాడుతూ ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర మత్స్యకార సమాజంలో ఐక్యత, విద్యా చైతన్యం కోసం విశేష కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. 1934లో గంగపుత్ర సంఘాన్ని స్థాపించి వివిధ మత్స్యకార వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.
గంగపుత్రుల కష్టాన్ని, శ్రమను సమాజం గుర్తించాలని, వారి వృత్తికి తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాలని అన్నారు. చేపపిల్లల పంపిణీలో పారదర్శకత పాటించి మత్స్యకార సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆధునిక చేపల పెంపకం, కోల్డ్ స్టోరేజీ, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. గంగపుత్ర విద్యార్థులకు ప్రత్యేక విద్యా ప్రోత్సాహకాలు, యువతకు ఉపాధి శిక్షణ, మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2027 జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించి కులాలవారీగా జనాభా వివరాలు సేకరించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపులు, రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని సూచించారు. ఆచార్య సందిరి బాలయ్య ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కులవృత్తులకు గౌరవం, మత్స్యకారులకు భరోసా కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక ఐక్యత, విద్య, రాజకీయ చైతన్యం అవసరమన్నారు. గంగపుత్రుల హక్కుల సాధనకు జరిగే ప్రయత్నాలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.
ఫిషరీస్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, వృత్తి అభివృద్ధికి సహకార సంఘాల బలోపేతం అవసరమన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా కృషి చేయాలన్నారు.
మాస్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ మాట్లాడుతూ సంప్రదాయ మత్స్యకార వృత్తిని కాపాడటంతోపాటు గంగపుత్రుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు సంఘటిత ప్రయత్నాలు అవసరమన్నారు.
బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులాలన్నీ ఐక్యంగా తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కులవృత్తుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు రూపొందించాలని కోరారు.
యువ నాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ యువత విద్య, ఉపాధి, సామాజిక చైతన్యంతో ముందుకు రావాలని, గంగపుత్రుల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అన్నారు. గంగతెప్పోత్సవం వ్యవస్థాపకులు మహేందర్ బాబు మాట్లాడుతూ గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, వృత్తి వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలని పేర్కొన్నారు.
ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర కుమారుడు సందిరి భగీరథ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ గంగపుత్ర సమాజం విద్య, ఐక్యత, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఐక్యతే గంగపుత్రుల బలం: సభాధ్యక్షుడు, గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు మంగళపల్లి శంకర్ మాట్లాడుతూ గంగపుత్రుల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం సమితి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గంగపుత్రులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
సమితి ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర మాట్లాడుతూ గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం సంఘటిత కార్యాచరణ చేపడతామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకుడు, ప్రముఖ విద్యార్థి యువ నాయకుడు బట్టు శ్రీధర్ గంగపుత్ర సభ విజయవంతానికి కృషి చేశారు.
ఆచార్య సందిరి బాలయ్య జయంతి ఉత్సవం కేవలం నివాళుల కార్యక్రమంగా కాకుండా గంగపుత్రుల ఉనికి, ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచింది. జై గంగపుత్ర.. జై జై గంగపుత్ర నినాదాలతో సభ ముగిసింది.
