తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్‌లో పారిశుధ్య కార్మికులతో తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు కే. ఏసురత్నం, ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి సమావేశమై కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మికులందరూ ఐక్యమత్యంతో సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ చేసేంతవరకు కనీస వేతనంగా నెలకు రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రతి కార్మికుడికి సంవత్సరానికి 15 సాధారణ సెలవులు, 8 జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేక కమిషనర్ ఈ ఏడాది జూన్ 19న జారీ చేసిన సర్క్యులర్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని కార్మికులందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పారిశుధ్య కార్మికులకు అవసరమైన చీపుర్లు, సబ్బులు, కొబ్బరి నూనెతో పాటు విధులకు సంబంధించిన పనిముట్లు, రక్షణ కిట్లు అందించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు హరినాథరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కూకట్పల్లి సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ, ఏఐటీయూసీ నాయకుడు మనోచారి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
