తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో సోమేశ్వర టెక్స్టైల్స్ & మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ, సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బతుకుదెరువు కోసం తెలంగాణ నుంచి సూరత్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన పద్మశాలి సోదరులు, అక్కడ కష్టపడి సంపాదించిన సొమ్ముతో తిరిగి సొంత గడ్డకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. మైలారంలో భూమి కొనుగోలు చేసి, సొంతంగా పవర్ లూమ్ చీరల ఫ్యాక్టరీ నిర్మించాలనే సంకల్పం రాబోయే తరాలకు గొప్ప మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రయత్నం విజయవంతమై, స్థానిక చేనేత, మరమగ్గాల కార్మికులకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
“ఇకనైనా వలసలకు బ్రేకులు వేసి, సొంత గడ్డపై ఆత్మగౌరవంతో నిలబడే తత్వం మనలో రావాలి. ఇలాంటి పారిశ్రామిక ప్రయత్నాల ద్వారానైనా వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
వలస కూలీలుగా వెళ్లిన చేతులే నేడు సొంత ఊరిలో పదిమందికి ఉపాధి కల్పించే యజమానులుగా ఎదగడం యావత్ పద్మశాలి సమాజానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు డ్రా పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. కార్యక్రమం ముగింపులో అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథి ఈగ మల్లేశంను శాలువాతో సన్మానించి, జ్ఞాపిక (మెమెంటో) అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, వైద్యం రాజగోపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి వెంగళ వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వన్నాల ప్రశాంత్, గోరంటాల రాజు, వన్నాల సాగర్, సోమేశ్వర టెక్స్టైల్స్ & మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోరంటాల కుమార స్వామి, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
