న్యూస్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో సామాజిక సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు మరియు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సూచించారు.

శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి జిల్లాలోని ఓ కీలక సామాజిక సమస్యపై చర్చించారు. కిరాయి ఇళ్లలో నివసించే కుటుంబాల్లో ఎవరైనా మరణించిన సందర్భాల్లో, ఇంటి యజమానులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచేందుకు అనుమతించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు పి.ఎన్. మూర్తి, మహేంద్ర కపూర్, డాక్టర్ అనితా రెడ్డి తదితరులు సీఎస్ఆర్ నిధులతో పద్మాక్షమ్మ గుడి సమీపంలోని స్మశానవాటిక వద్ద స్థలం కేటాయిస్తే ఉచితంగా భవనం నిర్మించి, దాని నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతామని ముందుకు వచ్చారు.

ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందిస్తూ, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను స్వయంగా కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి, ఇది ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల బాధలు తగ్గుతాయని, జిల్లా అభివృద్ధికి ఇది ఆదర్శప్రాయమైన చర్యగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రతి ఒక్కరూ సమాజ సమస్యల పరిష్కారానికి ఇలాంటి బాధ్యతతో ముందుకు వస్తే హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ అనితా రెడ్డి, పి.ఎన్. మూర్తి, మహేంద్ర కపూర్ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.