• ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్నే కొనసాగించాలి

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం కోరారు. ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తూ, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్) అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్లు 8, 9లను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. గత 18 ఏళ్లుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఇప్పుడు ఆ విధానంలో మార్పులు చేయడం వల్ల సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని గుజ్జ సత్యం పేర్కొన్నారు. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొనడం వల్ల కళాశాల యాజమాన్యాలు ముందుగానే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసే పరిస్థితులు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫీజులు చెల్లించకపోతే ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇవ్వడం మరింత ఆందోళనకరమని ఆయన విమర్శించారు. విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, పేద విద్యార్థులను భయపెట్టే విధానాలు అవలంబించడం సమంజసం కాదన్నారు. ఈ తరహా చర్యలు విద్యార్థుల్లో ఉన్నత విద్యపై నిరుత్సాహాన్ని పెంచి డ్రాప్‌అవుట్ల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా విడుదల కాలేదని గుర్తు చేసిన గుజ్జ సత్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైతే మరో రూ.10 వేల కోట్లు అప్పు తీసుకురావడంలో తప్పేమీ లేదన్నారు. విద్యపై ఖర్చు చేయడం వ్యయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి అని వ్యాఖ్యానించారు.

సామాజిక న్యాయం, విద్యా హక్కుల పరిరక్షణలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, విద్యార్థులపై భారం మోపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య ఈ పథకంపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్లు 8, 9లను ఉపసంహరించుకొని పాత విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. లేకపోతే పేద విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో ఐదు లక్షల మందితో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Avatar photo

By Murthy