తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: దౌల్తాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతులకు ముంగిట్లోనే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సన్న వడ్ల సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ లభిస్తుందని పేర్కొన్నారు.

వ్యవసాయ అధికారి సాయికిరణ్ మాట్లాడుతూ తెలంగాణ సోనా, జైశ్రీరామ్ వంటి సన్న వడ్ల రకాలను సాగు చేయాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అవలంబించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, డీఏపీకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా స్ప్రేలను ఉపయోగించాలని రైతులకు సూచించారు.
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్‌తో పాటు జొన్నలు, వేరుశనగ, కందులు, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, పంటల వైవిధ్యం, విత్తన శుద్ధి, ధ్రువీకరించిన విత్తనాల వినియోగం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ రమేష్, ఉపసర్పంచ్ ఆది బాలకృష్ణ, ఎరువుల దుకాణాల యజమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
