తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని ఏపీజీవీబీ (APGVB) బ్యాంకులో ఖాతాదారుల ఇబ్బందులను వెంటనే తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ డిమాండ్ చేశారు. బ్యాంకులో మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలకు లాక్‌లు విధించడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, వడ్ల డబ్బులు, ఇతర సంక్షేమ పథకాల నిధులతో పాటు పింఛన్ నగదును కూడా డ్రా చేసుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఎస్పీ నాయకులు పుల్లూరు APGVB బ్యాంకు మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ.. సరైన కారణం లేకుండా ఖాతాలపై లాక్‌లు విధించడం సరికాదన్నారు. దీనివల్ల నిరుపేదలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి, అర్హులైన ఖాతాదారులందరి లాక్‌లను వెంటనే తొలగించి నిధులు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.
