తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో కోరమాండల్ డీఏపీ (DAP) ఎరువుల బస్తాలపై కొందరు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులపై ఆయన తక్షణమే స్పందించారు. నేరుగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోరమాండల్ డీఏపీ బస్తాను కేవలం రూ.1350 లకే విక్రయించాలని, ఎలాంటి అదనపు లింకు లేదా ‘అటాచ్మెంట్’ వస్తువులను రైతులకు అంటగట్టకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి, కావాలని ఎక్కువ ధరకు అమ్ముతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యాపారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
రైతులకు స్పష్టత, పారదర్శకత చేకూరేలా ప్రతి ఎరువుల దుకాణం ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను (Price Display Boards) అందరికీ కనిపించేలా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించినా, ఎక్కువ ధరలకు అమ్మినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తక్షణమే స్పందించి, అధికారులను ఆదేశించిన వంగ రాజేశ్వర్ రెడ్డి చొరవ పట్ల సిద్దిపేట నియోజకవర్గ రైతాంగం పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తోంది.