తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ జిల్లా (జూలై 23):ఎడపల్లి, ధర్మారం-బి ( డిచ్ పల్లి): కామారెడ్డి-రాజంపేట రోడ్డుపై స్టేజీ దగ్గర బస్సులు ఆపడం లేదని ఇటీవల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. గతంలోనూ నాగారం డైట్ కళాశాల విద్యార్థులకూ ఇదే అనుభవం ఎదురైంది. అప్పటికే రద్దీ ఉందని డ్రైవర్లు బస్సును ఆపకుండా వెళ్తున్నారు.
‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాక బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈ కారణంగా పలు స్టాప్లలో విద్యార్థులున్నా బస్సులు ఆపడం లేదు. ఒకవేళ ఆపినా కాలు పెట్టే చోటులేక విద్యార్థులు ఎన్నోసార్లు తరగతులకు దూరమవుతున్నామని వాపోతున్నారు. ఈ సమస్య చాలా ప్రాంతాలలో కూడా జరుగుతుంది.
దీనితో రద్దీ రూట్లలో ఉదయం, సాయంత్రాల్లో అదనపు బస్సులు నడపాలని,లేదంటే విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతుందని వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు నిజామాబాద్, బోధన్ పట్టణాల్లోని కళాశాలల్లో చదువుకుంటున్నారు. వీరంతా సాటాపూర్ గేట్ వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. అప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసి ఉండటంతో బస్సులను స్టాప్ వద్ద ఆపడం లేదు. చివరకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి.
ధర్పల్లి మండలంలోని గడ్కోల్ ఎక్స్ రోడ్డు వద్ద నడిమితండా, కర్నర్ండా, హోన్నాజీపేట్, వాడి గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం బస్సుల కోసం వేచి చూస్తుంటారు. ఈ రూట్లో కళాశాల సమయానికి బస్సుల్లేవు. అడవి ప్రాంతం మీదుగా 5 కి.మీ. ప్రయాణించి వచ్చినా ధర్పల్లి- నిజామాబాద్ బస్సులను కొన్నిసార్లు ఆపడం లేదు.
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి స్టాప్ల వద్ద రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. వెనక వచ్చే బస్సు ఎక్కాలని డ్రైవర్లు, కండక్టర్లు ఎవరికి వారు ఆగకుండా వెళ్తున్నారనేది వారి ఆవేదన.
బస్సులు నిలపకపోవడం వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు మూడుసార్లు కళాశాలకు వెళ్లలేకపోయము.గతేడాది చాలాసార్లు ఈ అనుభవం ఎదురైంది. ప్రైవేటు ఛార్జీలు భరించే స్థోమతలేని ఎందరో పేద విద్యార్థుల కుటుంబాలకు నిరంతర సంఘర్షణ ఇది. ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడపాలి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
