ఆగస్టు 5న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి చేనేత చైతన్య సభ: రాపోలు వీర మోహన్
హుస్నాబాద్, జూలై 24: చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభ పోస్టర్‌ను రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, రాష్ట్ర కోశాధికారి రఘు, రాష్ట్ర, జిల్లా నాయకులు సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ, ఆగస్టు 5న కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సంక్షేమం, రంగ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ఈ సభలో సమగ్రంగా చర్చించనున్నట్లు చెప్పారు.
అలాగే ఇటీవల రాష్ట్రంలో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులను సభలో ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై పలువురు ప్రముఖులు సభలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, చేనేత కార్మికులు, యువత అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి చేనేత ఐక్యవేదిక నాయకులు గాజుల భగవాన్ నేత, చింతకింది శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఉమారాణి, కుమారస్వామి, శారద, ప్రభాకర్, కోటేశ్వర్, నాగభూషణం, లక్ష్మీపతి, రజిని, అరుణ్ తేజ్, లక్ష్మీనారాయణ, రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
