• విద్యార్థుల సహనాన్ని పరీక్షించొద్దు.. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

• బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలి: గుజ్జ సత్యం

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తెలంగాణలోనూ విద్యార్థులు, యువత ముందుండే బలమైన ‘జెన్-Z’ తరహా ప్రజాస్వామ్య ఉద్యమం అనివార్యమవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, BC JAC స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం హెచ్చరించారు.

హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చి, ఆ నిధులను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు.

“హామీ ప్రభుత్వానిది.. బకాయి ప్రభుత్వానిది.. మరి శిక్ష విద్యార్థికెందుకు? ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి చివరకు పేద కుటుంబం వ్యక్తిగత అప్పుగా మారడం ఏ రకమైన సంక్షేమం?” అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయని విద్యాసంస్థలు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అసలు బకాయి ఎంతన్నది అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం, సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు, విడుదలలు, పెండింగ్ మొత్తాలతో శ్వేతపత్రం విడుదల చేసి, బకాయిల చెల్లింపునకు నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించాలని కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం హైకోర్టు వరకు వెళ్లడం, నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం–కళాశాలల మధ్య ఆర్థిక వివాదం కారణంగా విద్యార్థుల పరీక్షలు, సర్టిఫికెట్లు, ప్లేస్‌మెంట్లు, ఉన్నత విద్యావకాశాలు ప్రభావితం కాకుండా ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు.

“నేటి యువతను తక్కువ అంచనా వేయొద్దు. సోషల్ మీడియా యువత చేతిలో బలమైన ప్రజాస్వామ్య వేదికగా మారింది. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు విషయంలో అన్యాయం జరిగితే విద్యార్థులు సంఘటితమవుతారు. యువత విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు.

తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులను సమన్వయం చేస్తూ శాంతియుత, రాజ్యాంగబద్ధ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు.

“విద్యార్థులు అడుగుతున్నది దానం కాదు.. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే. ‘నువ్వు చదువు.. ఫీజు మేం చెల్లిస్తాం’ అన్న మాటపై పేద కుటుంబాలకు నమ్మకం పోకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.