• చేనేత సహకార సంఘాల పాలకవర్గాల అభినందన సభను జయప్రదం చేయాలి: వనం శాంతికుమార్

వరంగల్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల పాలకవర్గాలకు అభినందనలు తెలియజేస్తూ, వారి విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 4, 2026 మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని వనస్థలిపురం కర్నాటి గార్డెన్స్‌లో నిర్వహించనున్న “చేనేత సహకార సంఘాల పాలకవర్గాల అభినందన సభ”ను విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి వరంగల్ మట్టేవాడ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులను తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతికుమార్, రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన పాలకవర్గాలన్నీ ఈ సభలో పాల్గొని చేనేత రంగ ఐక్యతను చాటాలని కోరారు.

నాయకులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన పాలకవర్గాలకు ఇది అభినందన సభ మాత్రమే కాకుండా, చేనేత రంగ అభివృద్ధి, సహకార సంఘాల బలోపేతం, కార్మికుల సంక్షేమం, ప్రభుత్వంతో సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు.

చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సహకార సంఘాల ద్వారా నేతన్నల ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

అందువల్ల వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, నేతన్నలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది.

Avatar photo

By Murthy