తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించడంపై కాటేదాన్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి ప్రజాదరణ తగ్గదని బీఆర్‌ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. పైస్థాయి పెద్దల ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించామని అధికారులు, పోలీసులు చెబుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనధికార ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలనే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా ఇదే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనధికార ఫ్లెక్సీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
కేవలం బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే మీకు భయమా? అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రతిపక్ష పార్టీపై ఒక న్యాయం, అధికార పక్షానికి మరో న్యాయం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని వెంకటేష్ అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన న్యాయం ఉండాలని, నిబంధనలు అందరికీ ఒకే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
