తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదైనా, సమాచారం మారినా వాటిని నవీకరించు కునే అవకాశం ఉంది. అయితే అన్ని వివరాలను ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉండదు. కొన్ని వివరాలకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. పేరు: ఆధార్‌లో పేరును సాధారణంగా రెండుసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. పేరు అక్షర దోషాలు, పూర్తి పేరు వంటి మార్పులను నిబంధనలకు అనుగుణంగా చేసుకోవచ్చు. పుట్టిన తేదీ: పుట్టిన తేదీని సాధారణంగా ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సరైన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. చిరునామా: ఆధార్‌లో చిరునామాను అవసరమైనన్ని సార్లు మార్చుకోవచ్చు. ప్రతి మార్పుకు చెల్లుబాటు అయ్యే చిరునామా ధ్రువీకరణ పత్రం అవసరం.మొబైల్ ఫోన్ నంబర్: ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబర్‌ను అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ సేవా కేంద్రంలో వేలిముద్రల ద్వారా గుర్తింపు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ తపాలా చిరునామా: ఆధార్‌లో నమోదైన విద్యుత్ తపాలా చిరునామాను కూడా అవసరాన్ని బట్టి నవీకరించుకోవచ్చు. చాయాచిత్రం, జీవగుర్తులు: ఆధార్‌లోని చాయాచిత్రం, వేలిముద్రలు, కంటి కనుపాపల గుర్తులను అవసరాన్ని బట్టి ఆధార్ సేవా కేంద్రంలో నవీకరించుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి ఆధార్‌లో వివరాలను మార్చేటప్పుడు సంబంధిత మార్పుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ వివరాల మార్పు కోసం అధికారిక ఆధార్ సేవా కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు.మీ ఆధార్.. మీ గుర్తింపు.. మీ హక్కు ఆధార్‌ను జాగ్రత్తగా వినియోగించండి.. సురక్షితంగా ఉంచుకోండి.
