తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  హైదరాబాద్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్ల వివరాల సేకరణ ప్రక్రియ రేపటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే దాదాపు 40 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిలో పలువురు ఓటర్ల వివరాల నమోదు పత్రాలను పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. సొంత రాష్ట్రాల్లో తమ ఓటు హక్కును కొనసాగించేందుకే కొందరు ప్రాధాన్యం ఇస్తుండటంతో హైదరాబాద్‌లో వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగుతాయా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది. అయితే, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు చేపట్టే పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలో తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.