• ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది మహనీయుల త్యాగాలకు ప్రతీక అని అన్నారు. భగత్ సింగ్ త్యాగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం, స్వామి వివేకానంద స్ఫూర్తి వంటి ఎన్నో మహనీయుల దేశభక్తి త్రివర్ణ పతాకంలో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం కేవలం బీజేపీ కార్యక్రమం కాదని, 140 కోట్ల మంది భారతీయుల దేశభక్తికి ప్రతీకగా నిలిచే కార్యక్రమమని ఆయన అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు చదువుతో పాటు దేశాన్ని ప్రేమించే భావనను పెంపొందించుకోవాలని సూచించారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిరంతరం దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్నారని, వారి త్యాగాలకు గౌరవంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు.
నర్సంపేట నియోజకవర్గం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై గర్వంగా జాతీయ జెండాను ఎగురవేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో #HarGharTiranga హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని కోరారు.
ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలతో నర్సంపేటలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
