తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన అధికారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జే.నర్సయ్య, విశిష్ట సేవా పతకం వరించిన సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్టీజీ శివమారుతిలను శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని, వీరి సేవలు ఇతర పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అధికారుల విశేష సేవల నేపథ్యం
* అదనపు డీసీపీ జే.నర్సయ్య: 1991లో ఎస్సైగా చేరి 35 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (ఐపీఎం) సహా పలు పతకాలు అందుకున్నారు.
* సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్టీజీ శివమారుతి: 1995లో ఎస్సైగా చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రూ.127 కోట్ల పాన్-ఇండియా సైబర్ మోసాల నెట్వర్ను ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ద్వారా ఛేదించి గుర్తింపు పొందారు. దర్యాప్తులో ప్రతిభకు గాను 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ సాధించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ శ్రీ యం. శ్రీనివాస్, ఐపిఎస్, జాయింట్ సీపీ (ఎస్బీ), నార్త్ రేంజ్ శాంతిభద్రతల జాయింట్ సీపీ శ్రీ.ఎస్.ఎం. విజయ్కుమార్, ఐపీఎస్, డీసీపీలు శ్రీ కిరణ్ ఖారే ఐపిఎస్ (చార్మినార్ జోన్), శ్రీ ఎస్. శ్రీనివాస ఐపిఎస్ (రాజేంద్రనగర్ జోన్), శ్రీ ఎమ్. చైతన్య కుమార్ ఐపిఎస్ (డీడీ), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (వుమెన్ సేఫ్టీ వింగ్), శ్రీ డి. రాజేష్ (శంషాబాద్ జోన్), శ్రీ జె. రాఘవేందర్ రెడ్డి (గోల్కొండ జోన్), శ్రీ ఎ. రమణా రెడ్డి (జూబ్లీహిల్స్) తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.
